షిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలకు మండి, చంబా, కాంగ్రా జిల్లాల్లో 20 మంది మృత్యువాతపడగా.. మరో ఆరుగురు గల్లంతయ్యారు. మండిలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది, చంబాలో ముగ్గురు, థియోగ్, కాంగ్రా జిల్లాల్లో ఇద్దరు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రాలోని బ్రిటిష్ కాలం నాటి చక్కిఖాడ్పైనున్న రైల్వే వంతెన కూలిపోయింది. పఠాన్‌కోట్ నుంచి జోగిందర్నగర్కు రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి.
మరో వైపు ప్రతికూల వాతావరణం నేపథ్యంలో మణి మహేశ్ యాత్ర రెండురోజుల పాటు వాయిదా పడింది. భర్మూర్ – హద్సర్ రహదారిని ప్రస్తుతం మూసివేశారు. శనివారం సాయంత్రం వరకు హిమాచల్‌ప్రదేశ్‌లో 268 రోడ్లు, 500 పవర్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 79 ఇండ్లు దెబ్బతిన్నాయి. ధర్మశాలలో 64 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయిలో 333 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం షిమాల్లో ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది.
మండిలోని జవాలాపూర్లో కదులుతున్న బైక్‌పై రాయి పడడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. జిల్లాలోని నాచన్ ప్రాంతంలోని పంచాయత్ కషన్లోని జాదోన్ గ్రామంలో శుక్రవారం రాత్రి కొండచరియలు విరిగిపడంతో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. తునాగ్ మార్కెట్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా దాదాపు 60 దుకాణాలు, 31 ఇండ్లు, 26 గోశాలతో పాటు వంతెన దెబ్బతిన్నాయి. మండిలో మూడు జాతీయ రహదారులను మూసివేయగా.. వందలాది మంది ప్రయాణికులు అర్ధరాత్రి నుంచి రైళ్లలో ఆకలి, దప్పికతో అలమటిస్తున్నారు.
కోటిరోపిలో భారీగా కొండచరియలు విరిగిపడడంతో అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. పఠాన్‌కోట్- మండి, మండి-కులు, మండి-జలంధర్ మీదుగా ధరంపూర్ ఎన్‌హెచ్‌లు నిలిచిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించడంపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయ, సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.