శ్రీనగర్, ఆగస్టు 30: జమ్మూ కశ్మీరులో సంభవించిన తాజా మేఘ విస్ఫోటాలు, కొండ చరియలు విరిగిపడిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులతో సహా 11 మంది మరణించారు. రియాసీ జిల్లాలో శుక్రవారం ఓ ఇంటిపైన కొండ చరియలు విరిగిపడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులు మరణించారు.
రాంబన్‌లోని పర్వత ప్రాంతమైన రాజ్‌గఢ్‌లో మేఘ విస్ఫోటం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గల్లంతయ్యారు. అనేక ఇళ్లు ధ్వంసం కాగా కొన్ని కొట్టుకుపోయాయి. సెప్టెంబర్ 2 వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాంబన్ జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది.