Indian Railways | ప్రయాగ్రాజ్: ప్రయాణికులకు కఠినమైన లగేజీ నిబంధనలు అమలు చేయడానికి రైల్వే శాఖ సిద్ధమవుతున్నది. ఇందుకోసం విమానాశ్రయాల తరహా విధానాన్ని అమలు చేయనున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎలక్ట్రానిక్ తూకపు యంత్రాల్లో తమ లగేజీ బరువును తనిఖీ చేయించుకోవాలి. నిర్ణీత బరువు కంటే ఎక్కువ లగేజీ కలిగి ఉన్నా లేదా నిర్ణీత బరువుకు లోబడి ఉన్నా.. భారీ సైజులో ఉన్న లగేజీకి అదనపు రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ఏసీ మొదటి తరగతి ప్రయాణికులు 70 కిలోలు, ఏసీ 2టైర్ ప్రయాణికులు 50 కిలోలు, ఏసీ 3టైర్, స్లీపర్ ప్రయాణికులు 40 కిలోలు, సాధారణ తరగతి ప్రయాణికులు 35 కిలోల వరకు లగేజీ తీసుకెళ్లేందుకు అనుమతించనున్నారు. మొదట ఉత్తర మధ్య రైల్వే జోన్లోని ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనను అమలు చేయాలని భావిస్తున్నారు. లగేజీ బరువు తనిఖీ పూర్తయ్యాకే ప్రయాణికులను ప్లాట్ఫామ్ మీదకు వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు ఆదాయం, ప్రయాణికుల సౌకర్యం కోసం ఆధునీకరించిన స్టేషన్లలో దుస్తులు, చెప్పులు, ఎలక్ట్రానిక్స్, ప్రయాణ ఉపకరణాలు అమ్మే ప్రీమియం సింగిల్-బ్రాండ్ స్టోర్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తున్నది.