భోపాల్: సైనికులతో కూడిన ప్రత్యేక రైలు వెళ్తుండగా రైలు పట్టాల వద్ద డిటోనేటర్లు పేలాయి. వీటిని చోరీ చేసిన రైల్వే సిబ్బంది ఈ సంఘటనకు పాల్పడినట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. (Railway staffer detained) మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 18న భుసావల్ డివిజన్లోని ఖాండ్వా నుంచి మిలటరీ ప్రత్యేక రైలు వెళ్తున్నది. నేపానగర్, ఖాండ్వా స్టేషన్ల మధ్య ఉన్న సగ్‌ఫాటా స్టేషన్ సమీపంలో రైలు పట్టాల పక్కన పది డిటోనేటర్లు పేలాయి. ఈ నేపథ్యంలో సైనికులతో కూడిన ఆ ప్రత్యేక రైలును నిలిపివేశారు. తనిఖీ తర్వాత రెండు నిమిషాల్లోనే ఆ రైలు అక్కడి నుంచి కదిలింది.
కాగా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రైల్వే ట్రాక్‌ను తనిఖీ చేసే ఉద్యోగి సబీర్ ఈ చర్యకు పాల్పడినట్లు గుర్తించారు. పొగ మంచు సమయాల్లో రైల్వే సిగ్నలింగ్ కోసం వినియోగించే ప్రమాదం కాని పటాకులైన పది డిటోనేటర్లను అతడు చోరీ చేసి రైలు పట్టాల వద్ద పేల్చినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడ్ని అరెస్ట్ చేశాడు. మరో రైల్వే సిబ్బందిని కూడా పశ్నించారు. అతడికి వార్నింగ్ నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు.
మరోవైపు తాను ఈ చర్యకు పాల్పడలేదని రైల్వే సిబ్బంది సబీర్ తెలిపాడు. ఆ రోజు తాను డ్యూటీలో లేనని, మద్యం సేవించి ఇంట్లో ఉన్నట్లు చెప్పాడు.