న్యూఢిల్లీ, జూన్ 7: వివిధ రైల్వే జోన్లు, డివిజన్లలో ప్రస్తుతం వేర్వేరుగా ఉన్న పద్ధతులను ఏకతాటిపైకి తీసుకువస్తూ రైలు సిబ్బంది(రన్నింగ్ స్టాఫ్) కోసం కొత్త ఔట్స్టేషన్ విశ్రాంతి నిబంధనలను రైల్వే శాఖ శనివారం ప్రకటించింది. అయితే వీటిని ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఆర్‌ఎస్‌ఏ) వ్యతిరేకించింది.
ఇది చట్ట వ్యతిరేక ఉత్తర్వుగా రైల్వే బోర్డుకు రాసిన లేఖలో అసోసియేషన్ అభివర్ణించింది. మంత్రిత్వ శాఖ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇది ఉల్లంఘిస్తోందని పేర్కొంది. భారతీయ రైల్వేలలో రన్నింగ్ స్టాఫ్ కోసం ఆరు రకాల ఔట్ స్టేషన్ విశ్రాంతి నిబంధనలు అమలులో ఉన్నాయని, అయితే వీటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జనరల్ మేనేజర్‌ను ఉద్దేశిస్తూ జూన్ 3న జారీ చేసిన సర్క్యులర్‌లో రైల్వే శాఖ పేర్కొంది.