న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం ముందు లేదని కేంద్ర రైల్వేల మంత్రి అశ్వని వైష్ణవ్ శుక్రవారం లోక్సభలో స్పష్టం చేశారు. స్టేషన్ రీడెవలప్మెంట్ కార్యక్రమం కింద భూములు, గగన తలం వాడుకునేందుకు లీజు హక్కులను నిర్ధిష్ట కాలపరిమితితో ప్రైవేట్ పార్టీలకు బదలాయిస్తామని సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ మంత్రి పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఏర్పడే ఆస్తులు లైసెన్స్ కాలపరిమితి ముగిశాక రైల్వేలకు తిరిగి సంక్రమిస్తాయని చెప్పారు. భారతీయ రైల్వేల్లో ఏ ఒక్క ప్యాసింజర్ ట్రైన్ సేవలను ప్రైవేట్ సంస్ధలు నిర్వహించడం లేదని తెలిపారు. రైల్వే స్టేషన్లు, రైళ్లను, రైల్వేల ఆస్తులను ప్రైవేటీకరించే ఆలోచన ఉందా అని సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలు వెల్లడించారు.