Indian Railway | దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతున్నది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతుండడంతో పొగమంచు భారీగా కమ్మేస్తున్నది. పొగమంచు, వాయు కాలుష్యంతో రైళ్లు, విమానాల రాకపోకలపై తీవ్రంగా ప్రభావం పడుతున్నది. కాలుష్యం కారణంగా దాదాపు 40 రైళ్లపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా ఆయా రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రాజధాని ఢిల్లీకి నడిచే రైళ్లన్నీ ఎనిమిది గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు, కాలుష్యం కారణంగా దృశ్యమానత సరిగా లేకపోవడమే ఇందు కారణం. జమ్మూ రాజధాని, పురుషోత్తం, శ్రమజీవి, ఇంటర్సిటీ సహా అనేక రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో రైల్వేశాఖ ఆలస్యంగా నడుస్తున్న రైళ్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
ఈ సీజన్లో తొలిసారిగా పొగమంచు కారణంగా భారీగా రైళ్లు ప్రభావితమవుతున్నాయని పేర్కొంది. పొచమంచు కారణంగా దృశ్యమానత చాలా తక్కువగా ఉందని.. రాత్రి సమయంలో పరిస్థితి మరింత దారునంగా ఉందని తెలిపింది. ప్రయాణికుల భద్రతే రైల్వే మొదటి ప్రాధాన్యత అని.. అందుకు రైళ్లను నెమ్మదిగా నడిపిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీకి రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న జాబితాలో విశాఖపట్నం – న్యూఢిల్లీ (20805) ఏపీ ఎక్స్ప్రెస్, పురుషోత్తం ఎక్స్ప్రెస్ (12801), శ్రమజీవి ఎక్స్ప్రెస్ (12391), రాణిఖేత్ ఎక్స్ప్రెస్ (15014), జమ్ము తావి ఎక్స్ప్రెస్ (12414), జమ్మూ మెయిల్ (14034), పంజాబ్ మెయిల్ (12138), డీడీఎన్ కోటా ఎక్స్ప్రెస్ (12402), ఇండోర్ -న్యూ ఢిల్లీ ఎక్స్ప్రెస్ (12415), యూపీ సంపర్క్ క్రాంతి (12447), సైనిక్ ఎక్స్ప్రెస్ (19701), యోగా ఎక్స్ప్రెస్ (19031), మాల్వా ఎక్స్ప్రెస్ (12919) ఆలస్యంగా నడుస్తున్నాయని పేర్కొంది.
ఆమ్రపాలి ఎక్స్ప్రెస్ (15707), ఆగ్రా – హోషియాపూర్ (11905), ముంబుయి – అమృత్సర్ ఎక్స్ప్రెస్ (11057), హిమాచల్ ఎక్స్ప్రెస్ (14054), గోవా సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ (12450), ఉత్తర సంపర్క్ క్రాంతి (12446), ఉధమ్పూర్-ఢిల్లీ ఏసీ ఎక్స్ప్రెస్ (22402), నేతాజీ ఎక్స్ప్రెస్ (12312), కాన్షిపూర్ ఎక్స్ప్రెస్ (11906)తో పాటు పలు మార్గాల్లో నడిచే రైళ్లు ఆలస్యమవుతున్నాయని రైల్వేశాఖ పేర్కొంది. అలాగే ఢిల్లీ నుంచి నడుస్తున్న హజ్రత్ నిజాముద్దీన్ – తిరువనంతపురం (06072), హజ్రత్ నిజాముద్దీన్-తిరువనంతపురం (22654), ఆనంద్ విహార్ జనసాధరన్ ఎక్స్ప్రెస్ (13258), న్యూఢిల్లీ-పుదుచ్చేరి (22404), ఆనంద్ విహార్- ముజఫర్పూర్ (05284) రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వేశాఖ వివరించింది.