Odisha Train Accident | ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రమాదానికి కవచ్‌తో సంబంధం లేదని.. ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లో మార్పుల కారణంగానే దుర్ఘటన జరిగిందని తెలిపారు. బాధ్యులను కూడా గుర్తించామని తెలిపారు. కవచ్‌కు, ప్రమాదానికి సంబంధం లేదని తెలిపారు. ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు. ఈ క్రమంలో అసలు ఇంటర్‌లాకింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఇంటర్‌లాకింగ్ అనేది ఒక భద్రత వ్యవస్థ. రైల్వే జంక్షన్లు, స్టేషన్లు, సిగ్నల్ పాయింట్ల వద్ద రైళ్ల కదలికలను సమర్థంగా నిర్వహించేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. దీని ఆధారంగానే రైల్వే స్టేషన్లలో రైలు ఏ ట్రాక్‌పై ఆగాలి? ఆగకుండా డైరెక్ట్‌గా వెళ్లేందుకు వేరే ట్రాక్ మార్చుకోవాలా? అనేది నిర్ణయిస్తారు. ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో ఉండే ట్రాక్ సర్క్యూట్లు రైలు యొక్క కదలికలను గుర్తించడంలో సహాయపడుతాయి. తదనుగుణంగా రైలు కదలికలను నియంత్రించడానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్ అనుమతి ఇస్తుంది. ఇంటర్ లాకింగ్ సిస్టమ్ సిగ్నల్స్, ట్రాక్ సర్క్యూట్ల స్థితిని పర్యవేక్షిస్తూ.. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పై వెళ్లకుండా, జంక్షన్ల వద్ద వ్యతిరేక దిశలో ప్రయాణించే రైళ్లను పసిగట్టి ప్రమాదాలను నివారించేందుకు సహాయపడుతుంది.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ అనేది ఇంటర్‌లాకింగ్ టెక్నాలజీ యొక్క ఆధునిక రూపం. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ ద్వారా రైలు కదలికలను పర్యవేక్షించి, ప్రమాదాల నుంచి నియంత్రించేందుకు వీలుంటుంది. సిగ్నల్ పాయింట్లను, ట్రాక్ సర్క్యూట్లను నిర్వహిస్తూ, సమన్వయం చేసేందుకు ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సహాయపడుతుంది. వీటిని సమన్వయం చేయడానికి కంప్యూటర్లను, ప్రోగ్రామ్బుల్ లాజిక్ కంట్రోలర్లను, కమ్యూనికేషన్ నెట్వర్కులను ఉపయోగిస్తారు.
కేంద్ర రైల్వే మంత్రి చెప్పినట్లు సిగ్నలింగ్ సరిగా ఇవ్వకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించొచ్చు. అంటే ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థలో సమస్య తలెత్తడమే. దీంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కోరమండల్ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. సిగ్నలింగ్‌లో సమస్య కారణంగానే ఒడిశా రైలు ప్రమాదం జరిగిందని రైల్వే బోర్డు ప్రాథమికంగా తెలిపింది.