న్యూఢిల్లీ : జుమ్లా, కొవిడ్ స్ప్రెడర్, కరప్ట్ వంటి పలు పదాలను అన్‌పార్లమెంటరీగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చలోకి ఎంటరై ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
ప్రధాని నరేంద్ర మోదీ పాలనను సరైన రీతిలో ఎండగడుతూ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా మారాయని, వీటిని మాట్లాడకుండా నిషేధించారని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు రాహుల్ గాంధీ న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా అనే క్యాప్షన్ ఇచ్చారు.
జుమ్లా జీవి, కొవిడ్ స్ప్రెడర్, స్నూప్గేట్తో పాటు తరచూ వాడే సిగ్గుచేటు, వేధింపులు, బూటకం, డ్రామా, హిపోక్రసీ, అసమర్ధత అని అర్ధం ధ్వనించే పదాలను కూడా లోక్‌సభ, రాజ్యసభలో అన్‌పార్లమెంటరీగా పేర్కొంటూ లోక్‌సభ సెక్రటేరియట్ బుక్‌లెట్‌ను విడుదల చేసింది. ఈ పదాలను అన్‌పార్లమెంటరీ జాబితాలో ప్రస్తావించడం పట్ల టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పదాలను తాను వాడతానని, దమ్ముంటే స్పీకర్ తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు.