న్యూఢిల్లీ: మహిళా కోటా చట్టాన్ని సవరించడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగంపై దాడి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం తెలిపారు. అందుకే ప్రతిపక్షం దీనిని ఓడించిందని అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం కాదని, దేశ ఎన్నికల నిర్మాణాన్ని మార్చేందుకు చేసిన ప్రయత్నమని విమర్శించారు.
మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కృతనిశ్చయంతో ఉంటే ఆయన 2023 చట్టాన్ని తీసుకు రావాలని, అప్పుడు విపక్షాలు ఆయనకు పూర్తిగా సహకరించి ఉండేవని అన్నారు. అనంతరం ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ ‘సవరణ బిల్లు వీగిపోయింది. మహిళల పేరుతో రాజ్యాంగ విచ్ఛిత్తికి వారు రాజ్యాంగ విరుద్ధ ఎత్తుగడ వేశారు. భారత్ ఇదంతా చూసింది. భారత్ దానిని నిలిపివేసింది. రాజ్యాంగానికి జై’ అని పేర్కొన్నారు.