న్యూఢిల్లీ, ఆగస్టు 20: 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. నేటి నుంచే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉంటారని అంతా ఆశిస్తున్నా.. ఆయన నుంచి సానుకూల స్పందన లేదని సమాచారం. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి అనంతరం కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ.. మళ్లీ ఆ పదవి చేపట్టాలని పార్టీ నేతలు ఎందరు కోరినా అందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా కూడా అనారోగ్య కారణాల వల్ల తిరిగి ఆ పదవి చేపట్టేందుకు నిరాసక్తత చూపుతున్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.