Vijay | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి విధించిన రూ.1.50 కోట్ల జరిమానాను రద్దు చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జరిమానా విధించిన ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వుల్లో ఎలాంటి చట్టవిరుద్ధం లేదని న్యాయమూర్తి జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి స్పష్టం చేశారు. 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ తన ఆదాయపు పన్ను రిటర్న్‌లో సుమారు రూ.35.42 కోట్ల ఆదాయం ప్రకటించారు. అయితే ‘పులి’ సినిమా ద్వారా వచ్చిన రూ.15 కోట్ల ఆదాయాన్ని ఖాతాల్లో చూపలేదని ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది.
2015లో ఆయన నివాసంలో జరిగిన సోదాల్లో లభించిన పత్రాలను ఆధారంగా తీసుకుని ఈ విషయం బయటపడింది. దీనిపై 2022లో ఐటీ శాఖ రూ.1.50 కోట్ల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా, తొలుత కోర్టు మధ్యంతర స్టే మంజూరు చేసింది. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు గత నెలలో తీర్పును రిజర్వ్ చేసి, తాజాగా పిటిషన్‌ను తిరస్కరించింది. విజయ్ తరపు న్యాయవాది వాదన ప్రకారం, చట్టపరంగా జూన్ 30, 2019లోపే జరిమానా ఉత్తర్వులు రావాల్సి ఉండగా 2022లో ఆలస్యంగా జారీ చేయడం చెల్లదని తెలిపారు. అయితే ఆదాయపు పన్ను శాఖ తరఫు న్యాయవాది, చట్ట నిబంధనల ప్రకారమే జరిమానా విధించామని వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన కోర్టు, ఐటీ శాఖ నిర్ణయంలో తప్పేమీ లేదని తేల్చింది.
తీర్పు అనంతరం విజయ్ తరపు న్యాయవాది అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరగా, అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించే హక్కు విజయ్‌కు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో హైకోర్టు స్థాయిలో కేసు ముగిసినప్పటికీ, తదుపరి న్యాయపరమైన మార్గాలు విజయ్‌కు అందుబాటులోనే ఉన్నాయి.