Rahul Gandhi : లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) సోమవారం మణిపూర్ (Manipur) లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన మణిపూర్ రాజధాని ఇంఫాల్ (Imphal) కు చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన జిరిబామ్ జిల్లాలో మైతీ వర్గానికి చెందిన వారు తలదాచుకున్న పునరావాస కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడున్న బాధితులను పరామర్శించనున్నారు.
అనంతరం చురాచంద్పూర్, బిష్ణుపూర్‌లోని మొయిరాంగ్ ప్రాంతాలకు చెందిన పునరాస కేంద్రాంలను కూడా రాహుల్ సందర్శించనున్నారు. కుకి, మైతీ తెగల మధ్య ఘర్షణల కారణంగా ఇరు తెగలకు చెందిన పలువురు ఆవాసాలను కోల్పోయి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. బీజేపీ సర్కారు వైఫల్యం కారణంగా మణిపూర్‌లో తెగల నడుమ ఘర్షణ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో ఇప్పుడు రాహుల్‌గాంధీ పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులను పరామర్శిస్తున్నారు.
అంతకుముందు అంటే ఇవాళ ఉదయం రాహుల్‌గాంధీ కచార్ జిల్లాలోని కుంభిగ్రామ్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత అసోం వరదల కారణంగా ఆవాసాలు కోల్పోయి లఖింపూర్‌లోని పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. అనంతరం రోడ్డు మార్గాన మణిపూర్‌కు చేరుకున్నారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులను పరామర్శించిన అనంతరం సాయంత్రం మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయ్కితో రాహుల్ భేటీ కానున్నారు. మణిపూర్ ఘర్షణలపై చర్చించనున్నారు. దానికి మణిపూర్‌లో కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీలతో రాహుల్ భేటీ కానున్నారు.