Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి అమెరికా పర్యటనకు (US Visit) వెళ్లనున్నారు. ఈనెల 21 నుంచి 22 తేదీల్లో ఆయన యూఎస్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ గురువారం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పవన్ ఖేరా (Pawan Khera) గురువారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.
తన పర్యటనలో రాహుల్ రోడ్ ఐలాండ్ (Rhode Island) లోని బ్రౌన్ యూనివర్సిటీని (Brown University) సందర్శిస్తారని తెలిపారు. అక్కడ విద్యార్థులు, అధ్యాపకులతో చర్చలో పాల్గొననున్నట్లు చెప్పారు. అంతేకాదు ఎన్నారై సంఘాలు, ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులతో రాహుల్ సమావేశం కానున్నట్లు తన పోస్ట్‌లో వెల్లడించారు. కాగా, గతంలో రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. గత పర్యటనల్లో రాహుల్.. భారత్‌లో మత స్వేచ్ఛ, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలపై చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజా పర్యటనలో ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో అన్న చర్చ జరుగుతోంది.
Also Read..
Robert Vadra | వరుసగా మూడో రోజు ఈడీ విచారణకు రాబర్ట్ వాద్రా