ముంబై : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) షెడ్యూల్ ఖరారైంది. గుజరాత్ నుంచి ప్రారంభం కానున్న జోడో యాత్ర ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో ముగుస్తుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
రాష్ట్రంలో పార్టీ నేతలు, శ్రేణులు రాహుల్ యాత్రకు సమాంతరంగా మార్చ్ చేపడతారని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో దశ గుజరాత్ నుంచి ఆరంభమై మేఘాలయా వరకూ కొనసాగుతుందని తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ తొలి విడత భారత్ జోడో యాత్ర కన్యాకుమారిలో ప్రారంభమై జనవరి 30న శ్రీనగర్లో ముగిసింది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 130 రోజుల పాటు 3970 కిలోమీటర్ల మేర జోడో యాత్ర సాగింది.