Rahul Gandhi : ఓట్ల చోరీ (Vote theft) కి సంబంధించి తాము ఇప్పటికే అణుబాంబు (Atom bomb) పేల్చామని, త్వరలోనే మరింత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు (Hydrozen bomb) పేలుస్తామని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ఆ తర్వాత ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారని చెప్పారు. ‘ఓటర్ అధికార్ యాత్ర (Voter Adhikar Yatra)’ ముగింపు సందర్భంగా పట్నాలో నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకు మేం అనుమతించబోం. బీజేపీని అడ్డుకునేందుకే ఈ యాత్ర నిర్వహించాం. దీనికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మహారాష్ట్రలో, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని ఆధారాలతో సహా చూపించాం. ఓట్ల చోరీ అంటే.. హక్కుల చోరీ, ప్రజాస్వామ్య చోరీ, ఉపాధి చోరీ అన్నట్లే. ఈ వ్యవహారంలో త్వరలోనే హైడ్రోజన్ బాంబు పేలుస్తాం’ అని రాహుల్ గాంధీ అన్నారు.
అయితే ‘ఓటరు అధికార్ యాత్ర’ ముగింపు సందర్భంగా ఇండియా కూటమి నేతలు పట్నాలో నిర్వహించిన ‘గాంధీ సే అంబేడ్కర్’ మార్చ్‌ను పోలీసులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దాంతో నేతలు అక్కడే ప్రసంగించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ ఓట్ల చోరీ ద్వారా గెలవడానికి యత్నిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఓడిపోతుందని జోస్యం చెప్పారు.
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ‘ఓటరు అధికార్ యాత్ర’ చేపట్టారు. ఆగస్టు 17న ససారాంలో మొదలైన ఈ యాత్ర 25 జిల్లాల్లోని 110 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,300 కిలోమీటర్ల మేర కొనసాగింది. బీహార్‌లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియ మొదలుకొని మహిళా సమస్యలు, రైతు సమస్యలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పారిశ్రామికాభివృద్ధి వంటి అంశాలను లేవనెత్తుతూ రాహుల్‌గాంధీ స్థానికులకు చేరువయ్యే ప్రయత్నం చేశారు.