న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ఒక దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election) అంటే అది రాష్ట్రాలపై దాడిగా ఆయన అభివర్ణించారు. ఇండియా, అదే భారత్ అంటే రాష్ట్రాల సమాహారం..ఒక దేశం. ఒకే ఎన్నిక ఆలోచన అంటే అది ఐక్యత సహా అన్ని రాష్ర్టాలపై దాడి అని రాహుల్ ఆదివారం ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన నేపధ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కమిటీలో రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు చోటు కల్పించకపోవడాన్ని రాహుల్ ఆక్షేపించారు. ఖర్గే స్ధానంలో మాజీ విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ను ఈ కమిటీలో సభ్యుడిగా చేర్చారు.
ఇంకా ఈ కమిటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 15వ ఆర్ధిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి సభ్యులుగా ఉన్నారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, మున్సిపాల్టీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడాన్ని పరిశీలిస్తూ సాధ్యమైనంత త్వరలో నివేదిక సమర్పించాలని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం శనివారం నియమించింది.
Read More