Rahul Gandhi : ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి భారత్‌కు పొంచిఉన్న ముప్పు అని కాంగ్రెస్ ఎంపీ (Congress MP) రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ విమర్శలు చేశారు. కొలంబియా పర్యటనలో ఉన్న ఆయన EIA యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, సంప్రదాయాలు ఉన్నాయని, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిఒక్కరికీ చోటు కల్పిస్తుందని, కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ ముప్పేటదాడిని ఎదుర్కొంటోందని అన్నారు.
విద్యార్థులతో మాట్లాడుతూ.. ఇంధన వినియోగంలో వచ్చిన మార్పులతో అనేక సామ్రాజ్యాల సృష్టి జరుగుతూ వస్తోందని అన్నారు. బ్రిటిష్‌వారు ఆవిరి యంత్రం, బొగ్గుపై నియంత్రణ సాధించారని, తర్వాత వారు సూపర్‌పవర్‌గా మారారని చెప్పారు. ఆ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి 1947లో తాము స్వాతంత్ర్యం సాధించుకున్నామని అన్నారు. పెట్రోల్ వినియోగం పెరిగిందని, ఆ క్రమంలోనే అమెరికన్ల పట్టుపెరిగిందని అన్నారు. ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ వైపు మళ్లుతోందని, ఇప్పుడు పోటీ అమెరికా, చైనా మధ్య నెలకొని ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో చైనానే ముందుందని చెప్పారు.
చైనాకు భారత్ పొరుగుదేశమని, అమెరికాకు మిత్రదేశమని రాహుల్‌గాంధీ అన్నారు. ఈ రెండు దేశాలు పోటీపడుతుంటే మధ్యలో తాము ఉన్నామని చెప్పారు. చైనాకంటే భారత్ జనాభా ఎక్కువని, చైనాలో కేంద్రీకృత వ్యవస్థ ఉందని, ఇండియాలో వికేంద్రీకృత, వైవిధ్య వ్యవస్థ ఉందని అన్నారు. చైనాతో పోల్చుకుంటే భారత్‌కున్న సామర్థ్యాలు భిన్నమైనవని చెప్పారు. భారత్ అధ్యాత్మిక, సైద్ధాంతిక సంప్రదాయాలను కలిగి ఉందని, అవి ఈనాటికీ ఆచరణీయమైనవని అన్నారు. చైనాలాగా భారత్ తన ప్రజలను అణచివేయదని చెప్పారు.