Rahul Gandhi | దేశంలో డ్రోన్ల తయారీ రంగం వృద్ధి చెందాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. ఆదివారం సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ‘డ్రోన్లు కేవలం సాంకేతికత కాదు. బలమైన పారిశ్రామిక వ్యవస్థ తయారు చేసిన అత్యున్నమైన ఆవిష్కరణలు. దురదృష్టవశాత్తూ దీనిని అందుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారు. ఆయన ఏఐపై టెలిప్రాంప్టర్లతో ప్రసంగాలు ఇస్తుండగా, మన పోటీదారులు మాత్రం కొత్త సాంకేతికతల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. భారత్‌లో డ్రోన్ల తయారీకి బలమైన పునాది కావాలి. ఉత్త మాటలు కాదు.’ అని రాహుల్ ఈ వీడియోలో పేర్కొన్నారు.
ఈ వీడియోలో రాహుల్ గాంధీ ఒక డ్రోన్ ఎగరేస్తూ కనిపించారు. ఇది 2022లోనే భారత్‌లో నిషేధించిన చైనాకు చెందిన డీజేఐ కంపెనీకి చెందిన డ్రోన్ అని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీఎఫ్ఐ) అధ్యక్షుడు స్మిత్ షా ఆరోపించారు. ‘నిషేధిత డ్రోన్‌ను ఆయన ఎలా పొందారు? 2021 డ్రోన్ నిబంధనల ప్రకారం అన్ని డ్రోన్లు డిజిటల్స్కైలో నమోదు చేసుకోవాలి.
డ్రోన్ ఎగరేయడానికి రిమోట్ పైలట్ సర్టిఫికెట్ ఉండాలి. రాహుల్‌కు ఈ సర్టిఫికెట్ ఉందా? రెడ్ జోన్లో డ్రోన్ ఎగరేయడానికి అనుమతి తీసుకున్నారా’ అంటూ స్మిత్ షా ప్రశ్నలవర్షం కురిపించారు. దేశంలో 400 డ్రోన్ల తయారీ పరిశ్రమలు ఉన్నాయని, 50 కంపెనీలు డ్రోన్ల పరికరాలను తయారు చేస్తున్నాయని తెలిపారు. దేశాన్ని కిందకు లాగేందుకు అబద్ధపు ప్రచారం మానుకోవాలని రాహుల్ గాంధీకి ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్‌దాస్ పై సూచించారు.