జైపూర్ : చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నా మన ప్రభుత్వం దాన్ని అంగీకరించడం లేదని, వాస్తవాలను మోదీ సర్కార్ దాచేస్తోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. భారత్-చైనా సరిహద్దు వివాదం విషయంలో తలెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేయడం లేదని అన్నారు. లడఖ్, అరుణాచల్ వైపున యుద్ధానికి డ్రాగన్ సిద్ధమవుతుంటే భారత ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్ విరుచుకుపడ్డారు.
#WATCH | China is preparing for war, but our government is not accepting it, it is hiding this fact: Congress MP Rahul Gandhi, at Jaipur, Rajasthan pic.twitter.com/6K1gAdvaY6
— ANI (@ANI) December 16, 2022
చైనా నుంచి ఆక్రమణ ముప్పు స్పష్టంగా కనిపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని దాచేందుకు ప్రయత్నిస్తోందని, కేంద్రం దాచాలన్నా ఇది దాగదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారంతో వందో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాజస్ధాన్‌లోని జైపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ కాషాయ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ విద్వేష, విభజించి పాలించే అజెండాతో తాను విభేదిస్తానని అన్నారు.
బీజేపీ అడ్డదారుల్లో ఎన్నికల్లో విజయాలు సాధించి, మెజారిటీని దక్కించుకుంటున్నదని తనకు తెలుసునన్నారు. వారంటే (బీజేపీ) ఏంటో వారికి స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు పార్టీ వెన్నంటే ఉన్నారని చెప్పారు. బీజేపీ విజన్‌తో కాంగ్రెస్ దీటుగా పోటీ పడాలని, కాంగ్రెస్ తన స్వభావాన్ని నిలుపుకుంటూ ముందుకు సాగడం కీలకమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.