న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన తరహాలోనే అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారం కోరారు. రైతుల ఆందోళనతో వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న మాదిరి వివాదాస్పద ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీం అగ్నిపథ్‌ను వెనక్కితీసుకోవాలని కాంగ్రెస్ నేత ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
గత ఏడాది మూడు సాగు చట్టాలను ఉపసంహరించే సమయంలో ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పిన విధంగానే దేశ యువతకు మోదీ మరోసారి క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ కోరారు. ఎనిమిదేండ్లుగా మోదీ ప్రభుత్వం జై జవాన్..జై కిసాన్ విలువలను అవమానిస్తోందని దుయ్యబట్టారు.
సైనిక ఉద్యోగార్ధుల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీంపై హింసాత్మక నిరసనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగ యువత బాధలు, వారిలో నెలకొన్న నైరాశ్యాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకోవడం లేదని, తక్షణం అగ్నిపథ్ స్కీంను వెనక్కితీసుకోవాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాధ్రా డిమాండ్ చేశారు.