బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Assembly Elections) పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్నిహోరెత్తిస్తున్నాయి. ర్యాలీలు, రోడ్‌షోలు, భారీ బహిరంగ సభలతో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. తిర్ధహళ్లిలో మంగళవారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మూడేండ్ల కిందట దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. కాషాయ సర్కార్ అధికారాన్ని బలవంతంగా గుంజుకుందని ఆరోపించారు. బీజేపీ సర్కార్ అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ నిలదీశారు. కర్నాటకలో కాషాయ సర్కార్ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో మోదీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ తనపై 91 సార్లు దాడి చేసిందని చెబుతున్నారు తప్ప కర్నాటక గురించి ఏమీ మాట్లాడటం లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో మోదీ చెప్పాలని అన్నారు. ప్రధాని మోదీ ప్రచారంలో తన గురించే మాట్లాడుతున్నారు తప్ప బీజేపీలో ఇతర నాయకుల గురించి, యువత, మహిళల గురించి అసలు ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More