Wayanad Tragedy : వయనాద్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఉదంతంలో ఇప్పటివరకూ 300 మందికి పైగా మరణించారు. వయనాద్ ఘటన హృదయ విదారకమని లోక్‌సభ విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. తాను నిన్నటి నుంచి వయనాద్లోనే ఉన్నానని, ఇది భయానక విషాద ఘటన అని తాము ఇక్కడ అధికారులతో సమావేశమై పరిస్ధితి సమీక్షిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఎంతకు చేరవచ్చు, దెబ్బతిన్న గృహాల వివరాలు, నష్టాన్ని తగ్గించేందుకు, సహాయ పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయడంపై తమ వ్యూహాన్ని అధికారులు తమకు వివరించారని రాహుల్ తెలిపారు.
తాము ఎలాంటి సాయం చేసేందుకైనా వెనుకాడమని, ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని వివరించామని చెప్పారు. కాంగ్రెస్ కుటుంబం ఇక్కడ 100కుపైగా ఇండ్లను బాధితులకు నిర్మించి ఇస్తుందని, ఇది బాధితులకు తాము ఇస్తున్న భరోసా అని రాహుల్ గాంధీ తెలిపారు. ఇంతటి విషాదాన్ని కేరళ ముందెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎంతో కలిసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని తెలిపారు.
ఇది భిన్నమైన విషాదమని దీని నుంచి బయటపడేందుకు వినూత్న వ్యూహంతో ప్రణాళికా బద్ధంగా సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టాలని చెప్పారు. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాద్ జిల్లాలో పర్యటించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో బాధిత కుటుంబాలను, స్ధానికులను కలిశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.
Read More :
NEET-UG 2024: పాట్నా, హజారిబాగ్‌లో మాత్రమే నీట్ పేపర్ లీకేజీ: సుప్రీంకోర్టు