బెర్లిన్: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. ఓటరు జాబితా అంశంలో తీవ్ర సమస్యలు ఉన్నాయని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అన్న టాపిక్‌పై రాహుల్ గాంధీ ప్రసంగించారు. 2024లో హర్యానా, మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సమర్పించినా, ఎన్నికల సంఘం నుంచి తమకు సంతృప్తికరమైన సమాధానాలు రాలేదన్నారు.
తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్‌లో తమ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించిందని, కానీ హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎన్నికలు సజావుగా జరగలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటరు లిస్టుల్లో డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నట్లు పేర్కొన్నారు. హర్యానా ఓటరు జాబితాలో ఓ విదేశీ వ్యక్తి పేరు అనేక సార్లు రిపీట్ అయినట్లు చెప్పారు. భారతీయ వ్యవస్థీకృత ఫ్రేమ్‌వర్క్‌ను క్రమంగా నిర్వీర్యం చేస్తున్నట్లు రాహుల్ ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లాంటి సంస్థలతో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ప్రతిపక్షాలకు సపోర్టు ఇస్తున్న వ్యాపారవేత్తలను వత్తిడికి గురి చేస్తున్నారన్నారు. అధికారంలో ఉన్న బీజేపీకి అండగా ఉన్నవారికి రక్షణ కల్పిస్తున్నారన్నారు. దీంతో దేశంలో అసమతుల్య రాజకీయ పరిస్థితులు నెలకొన్నట్లు చెప్పారు. అయిదు రోజుల పర్యటన కోసం రాహుల్ గాంధీ జర్మనీ వెళ్లారు. తన పర్యటనలో రాహుల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.