Rahul Gandhi : రాజ్యాంగంపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మౌనం దాల్చడం పట్ల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మౌనం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో హిందువులకు వ్యతిరేకంగా రాజ్యాంగంలో చేసిన మార్పులను పక్కనపెట్టాలంటే రాజ్యాంగాన్ని సవరించాలని, ఇందుకు పార్లమెంట్ ఉభయసభల్లో, రాష్ట్రాల్లో మూడింట రెండువంతుల మెజారిటీ బీజేపీకి అవసరమని అనంత్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా విపక్ష నేతలు భగ్గుమన్నారు. నరేంద్ర మోదీ, సంఘ్ పరివార్ ఉద్దేశాలను బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు బట్టబయలు చేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలను సంవిధాన్ (రాజ్యాంగం) సంఘ్విధాన్ల మధ్య పోరాటంగా కాంగ్రెస్ ఎంపీ అభివర్ణించారు. ఇక అనంత్ హెగ్డే వ్యాఖ్యలపై అంతకుముందు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలో పాలక కాషాయ పార్టీ రాజ్యాంగాన్ని పూర్తిగా అంగీకరించలేదని, రాజ్యాంగంపై ఆ పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
రాజ్యాంగాన్ని బీజేపీ పూర్తిగా అంగీకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని ఓ వైపు ప్రధాని చెబుతుండగా, రాజ్యాంగాన్ని మార్చేందుకు మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమని చెప్పాలని తమ పార్టీ సభ్యులను ఆయన కోరుతున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చడంపై సాధారణ వ్యక్తులు మాట్లాడటం లేదని, బీజేపీ ఎంపీలు, ముఖ్య నేతలే మాట్లాడుతున్నారని ఆరోపించారు.
పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడితే తక్షణమే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని ఖర్గే బీజేపీని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పట్ల బీజేపీకి విశ్వాసం ఉంటే అలాంటి వ్యక్తులను పార్టీ నుంచి తొలగించాలని, వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు నిరాకరించాలని ఖర్గే కోరారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడం గురించి మాట్లాడే మోదీ తమ పార్టీ నేతలు చేసే అలాంటి వ్యాఖ్యల పట్ల మాత్రం మౌనం దాల్చుతారని కాంగ్రస్ చీఫ్ మండిపడ్డారు.
Read More :
Upasana | అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన మెగా కోడలు ఉపాసన