Kangana Ranaut | సెబీ ఛైర్పర్సన్ మధాబి పూరీ బుచ్ ఆమె భర్త ధవల్ బుచ్‌లపై యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్‌బర్గ్ (hindenburg) తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ రిపోర్ట్ దేశంలో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై విపక్ష కూటమి పార్టీల ఎంపీలు కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్డీయే సర్కార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సైతం విరుచుకుపడ్డారు. ఇన్వెస్టర్ల సంపద నష్టపోతే ఎవరిది బాధ్యత అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగన రనౌత్ స్పందించారు. ఈ మేరకు రాహుల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి అని ఆరోపించారు. దేశం ఆయన్ని ఎన్నటికీ నాయకుడిగా ఎన్నుకోదని వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత, విధ్వంసకర వ్యక్తి. అతని ఎజెండా ఏమిటంటే.. ఆయన ప్రధాన మంత్రి కాలేకపోతే ఈ దేశాన్ని కూడా నాశనం చేయొచ్చు. దేశ భద్రతను, ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు రాహుల్ గాంధీ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు’ అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ‘రాహుల్.. మీరు జీవితాంతం ప్రతిపక్షంలోనే కూర్చోడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ కంగన ఎద్దేవా చేశారు. ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ నాయకుడిగా ఎన్నుకోరంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi is the most dangerous man, he is bitter, poisonous and destructive, his agenda is that if he can’t be the Prime Minister then he might as well destroy this nation.
Hindenberg report targeting our stock market that Rahul Gandhi was endorsing last night has turned out…— Kangana Ranaut (@KanganaTeam) August 12, 2024
గౌతం అదానీ సారధ్యంలోని అదానీ గ్రూప్ సంస్థలపై యూఎస్ షార్ట్ సెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ తాజా ఆరోపణలపై లోక్ సభలో విపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెబీ చైర్ పర్సన్‌గా మాధాబి పురీ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ పోస్ట్ లో ప్రశ్నించారు. చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల సంపదకు రక్షణ కల్పించాల్సిన స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’.. తమ చైర్ పర్సన్ కు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణల విషయమై రాజీ పడిందని పేర్కొన్నారు.
‘ఇండియా, ఆస్ట్రేలియా మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు, ఆ మ్యాచ్ వీక్షించే ప్రతి వ్యక్తికి మ్యాచ్ అంపైర్ రాజీ పడ్డారా లేదా? అన్న సంగతి తెలిసిపోతుంది. మ్యాచ్ లో ఏం జరుగుతుంది? పారదర్శకంగా జరిగే మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుంది. మ్యాచ్ లో పాల్గొనే కొందరు వ్యక్తుల గురించి.. ఆ మ్యాచ్ వీక్షించే మీరు ఎలా ఫీల్ అవుతారు. భారత స్టాక్ మార్కెట్లలోనూ సరిగ్గా అదే జరుగుతుంది’ అని రాహుల్ గాంధీ తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.
సెబీ చైర్ పర్సన్ మాధాబీ పురీ బుచ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదని దేశంలోని నిజాయితీ గల ఇన్వెస్టర్లు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఒకవేళ ఇన్వెస్టర్లు తాము ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ము నష్టపోతే .. ప్రధాని మోదీ, సెబీ చైర్ పర్సన్, గౌతం అదానీల్లో ఎవరిది బాధ్యత అని ప్రశ్నించారు. తాజాగా హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన తీవ్రమైన ఆరోపణలను సుప్రీంకోర్టు తిరిగి సుమోటోగా స్వీకరించి విచారిస్తుందా? అని అన్నారు. దీనిపై జేపీసీ విచారణకు ఆదేశించడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్థమైందన్నారు.
Also Read..
Rajasthan | ఎడారి రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షం.. 20 మంది మృతి