Rahul Gandhi | ఇటీవలే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు స్థానాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ (Raebareli), కేరళలోని వయనాడ్ (Wayanad) నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. అయితే, ఈ ఎన్నికల్లో రాహుల్ కంటే.. బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన విక్రమాదిత్య సింగ్‌కే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రియారిటీ ఇచ్చింది. ఎన్నికల ఫండ్ విషయంలో రాహుల్ కంటే విక్రమాదిత్యకే ఎక్కువ మొత్తం ఇచ్చింది.
లోక్‌సభ ఎన్నికల కోసం తమ అభ్యర్థులకు ఫండ్ (Congress Fund) కింద ఎంత మొత్తం అందించామన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసింది. ఈ క్రమంలో రాహుల్‌కు రూ.1.40 కోట్లను ఇచ్చినట్లు తెలిపింది. ఒక్కోస్థానానికి రూ.70 లక్షలు చొప్పున రెండు స్థానాలకు కలిపి ఈ మొత్తాన్ని అందించినట్లు వెల్లడించింది. అయితే, పార్టీలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి లోక్‌సభ స్థానం (Mandi seat) నుంచి పోటీ చేసిన విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh)కు అత్యధిక ఫండ్ అందించినట్లు తెలిపింది. ఏకంగా రూ.87 లక్షలు ఇచ్చినట్లు పేర్కొంది. అయితే, ఆ స్థానం నుంచి విక్రమాదిత్య సింగ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మండి నుంచి బాలీవుడ్ స్టార్ నటి, బీజేపీ నాయకురాలు కంగన రనౌత్ (Kangana Ranaut) చేతిలో ఓటమి చవిచూశారు.
అదేవిధంగా అమేథిలో బీజేపీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీని ఓడించిన కిషోరీలాల్ శర్మకు, కేరళ అలప్పుజ నుంచి పోటీ చేసిన కేసీ వేణుగోపాల్, మాణికం ఠాగోర్ (విరుధునగర్, తమిళనాడు), కర్ణాటకలోని గుల్బర్గా నుంచి బరిలోకి దిగిన రాధాకృష్ణ, పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ నుంచి పోటీ చేసిన విజయ్ ఇందర్ సింగ్లాకు ఒక్కొక్కరికి రూ.70లక్షలు అందించినట్లు హస్తం పార్టీ తెలిపింది. ఇక ఈ ఎన్నికల్లో ఫండ్ కింద కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆనంద శర్మకు రూ.46 లక్షలు, దిగ్విజయ్ సింగ్ రూ. 50 లక్షలు అందుకున్నారు. అయితే, ఇద్దరు నేతలూ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. మరోవైపు రెండు స్థానాల్లో గెలుపొందిన రాహుల్.. రాయ్‌బరేలీ స్థానాన్ని అట్టే పెట్టుకున్నారు. వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అక్కడ ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నట్లు తెలిసింది.
Also Read..
Rajnath Singh | రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు.. కోల్‌కతా ఘటనపై రాజ్‌నాథ్ సింగ్ స్పందన
Rimi Sen: ల్యాండ్ రోవర్ కారు కంపెనీపై 50 కోట్ల నష్టపరిహారం కేసు వేసిన నటి రిమి సేన్
Ravi Shankar | మిస్టరీ వీడబోతుంది.. క్యూరియాసిటీ పెంచుతున్న రవిశంకర్ ప్రీ లుక్