ముంబై : జాగ్వార్ ల్యాండ్ రోవర్ కంపెనీపై బాలీవుడ్ నటి రిమి సేన్(Rimi Sen) నష్టపరిహారం కేసు దాఖలు చేసింది. తన కారుకు వస్తున్న సమస్యలతో చిర్రెత్తిన ఆమె.. ల్యాండ్ రోవర్‌పై 50 కోట్ల పరిహారం కేసును ఫైల్ చేసింది. 2020లో రిమిసేన్.. ల్యాండ్ రోవర్ కారును 92 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ ఆ కారుకు చేయిస్తున్న రిపేర్లతో తనకు మానసిక వేధింపులు కలుగుతున్నట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆథరైజ్డ్ డీలర్ సతీశ్ మోటార్స్ సంస్థ నుంచి తన కారును కొనుగోలు చేసిందామె. 2023 జనవరి వరకు దానికి వారెంటీ ఉన్నది. అయితే కోవిడ్ , లాక్డౌన్ వల్ల ఆ సమయంలో కారు ఎక్కువగా షెడ్డుకే పరిమితమైంది.కానీ ఆ తర్వాత ఆమె కారును ఎక్కువగా వాడింది.
అతిగా వాడడం వల్ల ఆ కారులో ఉన్న లోపాలు బయటకు వచ్చాయి. సన్‌రూఫ్, సౌండ్ సిస్టమ్, రియర్ ఎండ్ కెమెరాల్లో సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. రియర్ ఎండ్ కెమెరాలో లోపం వల్ల.. తన కారు పిల్లర్‌కు ఢీకొన్నట్లు ఆమె చెప్పారు. డీలర్‌కు ఈ విషయాన్ని చెప్పినా, ఆధారాలను అడిగినట్లు తెలుస్తోంది. ఒకటి రిపేర్ చేయగానే మరొకటి రిపేర్ వస్తోందన్నారు. కారు తయారీ లోపాభూయిష్టంగా ఉన్నదని, ఉత్పత్తిలోనూ, మెయింటేనెన్స్ కూడా సరిగా లేదని ఆమె ఫిర్యాదు చేసింది. కారు వల్ల తనకు కలిగిన మానసిక వేదనకు 50 కోట్లు డిమాండ్ చేసింది రిమిసేన్. ఇక లీగల్ ఖర్చు అదనంగా 10 లక్షలు అడిగిందామె.