బళ్లారి : భారత్ జోడో యాత్ర వేదికగా కాషాయ పార్టీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. కర్నాటకలోని బళ్లారిలో శనివారం జరిగిన మెగా ర్యాలీలో బీజేపీ, ఆరెస్సెస్‌లపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని ముక్కలు చేయడమే బీజేపీ, ఆరెస్సెస్‌ల సిద్ధాంతమని ఆయన మండిపడ్డారు. దేశాన్ని చీల్చేందుకు బీజేపీ, ఆరెస్సెస్‌లు పూనుకుంటున్నాయని ప్రజలు భావిస్తుండటంతోనే దేశాన్ని కలిపిఉంచేందుకు ప్రజలను ఐక్యం చేసేందుకు తన పాదయాత్రకు భారత్ జోడో యాత్రగా నామకరణం చేశామని చెప్పారు.
బళ్లారిలో జరిగిన భారీ బహిరంగ సభలో కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రతో కర్నాటకలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర 38వ రోజుకు చేరుకోగా ఇప్పటివరకూ ఆయన వేయి కిలోమీటర్లు పైగా నడిచారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్ధితిని మెరుగుపరిచే వ్యూహంతో చేపట్టిన ఈ యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3570 కిలోమీటర్లు సాగుతూ జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను బలోపేతం చేసే లక్ష్యంతో రాహుల్ యాత్ర సాగుతోంది.