Rahul Gandhi | వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది పుణేలో ఎంపీ-ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఓట్ల చోరీ’ అంశాన్ని బహిర్గతం చేసిన తర్వాత భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయని పిటిషన్లో న్యాయవాది మిలింద్ పవార్ పేర్కొన్నారు. బీజేపీ నేత ఆర్ఎన్ బిట్టు రాహుల్ గాంధీ ‘ఉగ్రవాది’ అని సంబోధించారు. మరో బీజేపీ నేత తర్వింద్ మార్వా సైతం బహిరంగంగానే బెదిరింపులకు దిగిన విషయాన్ని ప్రస్తావించారు.
రాహుల్ గాంధీ సరిగ్గా నడుచుకోవాలని.. లేకపోతే ఆయనకు అమ్మమ్మకు పట్టిన గతేపడుతుందని హెచ్చరించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడు సాత్కకి సావర్కర్, గాడ్సే కుటుంబాలతో ఉన్న సంబంధాన్ని సైతం ప్రస్తావించారు. ఫిర్యాదుదారుడి వంశపారంపర్యత, ప్రస్తుత రాజకీయ వాతావరణంతో ముడిపడి ఉన్న హింసాత్మక, రాజ్యాంగ వ్యతిరేక ధోరణులను దృష్టిలో ఉంచుకుని, వినాయక్ సావర్కర్ భావజాలాన్ని విశ్వసించే వ్యక్తుల వల్ల రాహుల్ గాంధీకి హాని జరుగవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ హత్యను ప్రస్తావరించారు. మహాత్మాగాంధీ హత్య కుట్ర ఫలితంగా జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యే సమయంలో భద్రత కల్పించాలని కోరారు.
కేసు వివరాల్లోకి వెళితే.. 2023 మార్చిలో రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగం సావర్కర్‌ని అవమానించేలా ఉందంటూ సాత్యకి సావర్కర్ 2025 జనవరిలో పుణే కోర్టులో పరువు నష్టం కేసును వేశారు. సావర్కర్తో పాటు మరికొందరు కలిసి ఓ ముస్లిం వ్యక్తిని కొట్టడం ఆనందంగా భావించారని రాహుల్ తన ప్రసంగంలో పేర్కొన్నారంటూ సాత్యకి ఆరోపించారు. రాహుల్ వ్యాఖ్యలు సావర్కర్ గౌవవానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపించారు. సావర్కర్ తన రచనల్లో అలాంటివేమీ పేర్కొనలేదన్నారు. ఐపీసీ సెక్షన్ 500 కింద రాహుల్‌ను దోషిగా నిర్దారించాలని.. 377 సీఆర్పీసీ కింద పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా కేసును కోర్టు సెప్టెంబర్ 10న విచారించనున్నది.