Rahul Gandhi : కాంగ్రెస్ సీనియర్ లీడర్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ క్షమాపణలకు అంగీకరించారు. గతంలో మాజీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తనయుడు కార్తికేయ సింగ్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. గతంలో పనామా పత్రాలకు సంబంధించి వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాహుల్ గాంధీ అప్పట్లో మాట్లాడారు.
2018లో, మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల సందర్భంగా ఝబ్వాలో నిర్వహించిన ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. పనామా పత్రాలకు, శివరాజ్ సింగ్ చౌహాన్ తనయుడు కార్తికేయ సింగ్‌కు సంబంధం ఉందని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై కార్తికేయ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలతో తన పరువుకు నష్టం కలిగిందని, అనవసరంగా, ఆధారాలు లేకుండా తన పేరు ప్రస్తావించారని కార్తికేయ సింగ్ అన్నారు. దీంతో రాహుల్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై కార్తికేయ సింగ్.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు రాహుల్ వ్యాఖ్యల్ని తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించారు. తాను చేసిన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించినవి కావన్నారు.
తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ జస్టిస్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో సమర్పించిన వివరాల్ని భోపాల్ కోర్టుకు అందించనున్నారు. గతంలోనే ఈ కేసు విచారణ కోసం కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆయన తరఫున న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు.