Bihar polls : బీహార్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) నేపథ్యంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఎన్డీయే కూటమి (NDA alliance) అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్ష మహాఘట్బంధన్ (Mahaghatbandan) లో ఇంకా సీట్ల పంపకాల పంచాయతీ తెగలేదు. ఈ క్రమంలో ఆర్జేడీ అధినేత (RJD chief) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తో.. కాంగ్రెస్ అధ్యక్షుడు (Congress President) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఫోన్లో సంప్రదింపులు జరుపుతూ సీట్ల సర్దుబాటుపై చర్చిస్తున్నట్లు తెలిసింది.
సీట్ల పంపకాల్లో ముందున్న ఎన్డీయే కూటమి పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయినప్పటికీ విపక్ష ఇండియా కూటమిలో పార్టీలు మాత్రం సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి రావడం లేదు. కాంగ్రెస్కు దాదాపు 50 సీట్లు ఇచ్చేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉండగా.. కాంగ్రెస్ మాత్రం కనీసం 60 స్థానాలు కేటాయించాలని పట్టుపడుతున్నట్లు తెలిసింది. కానీ తమ పార్టీకి పట్టున్న స్థానాలను వదులుకునేందుకు ఆర్జేడీ సిద్ధంగా లేదు. దాంతో సీట్ల షేరింగ్ కొలిక్కి రావడం లేదని తెలుస్తోంది.
రాష్ట్రస్థాయిలో రెండు పార్టీల నేతలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఈ అంశం తేలలేదు. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. ఖర్గే, రాహుల్ ఇద్దరూ లాలూతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. చర్చలు కొలిక్కి వస్తేనే ప్రతిపక్ష కూటమి అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు లైన్ క్లియర్ కానుంది.