Jodo yatra Ends | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం ముగిసింది. నిజానికి ఈ యాత్రను ఈ నెల 30 న ముగించాలని తొలుత నిర్ణయించారు. అయితే, ఒకరోజు ముందుగానే యాత్రను ముగించారు. ముగింపు సందర్భంగా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో సోదరి ప్రియాంకతో కలిసి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. రాహుల్ లాల్‌చౌక్ వస్తుండటంతో పెద్ద ఎత్తున భద్రత చర్యలు తీసుకున్నారు. లాల్ చౌక్ పరిసరాల్లోని దుకాణాలను పోలీసులు మూసివేయించారు. రేపటి కాంగ్రెస్ కార్యాలయం కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు.
భారీ సెక్యూరిటీ మధ్య రాహుల్, ప్రియాంక లాల్‌చౌక్ చేరుకున్నారు. భద్రతా సిబ్బంది కారులో వీరు వచ్చారు. వీరి వెంట జైరాం రమేశ్ ఉన్నారు. లాల్ చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారు. ఆ ప్రాంతమంతా బారికేడ్లతో మూసివేశారు. చుట్టుపక్కల దుకాణాలన్నీ మూతపడ్డాయి. పంథా చౌక్ నుంచి అవామీ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ముజఫర్ షా వీరితో జత కలిశారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు రాహుల్ మీడియా సమావేశంలో పాల్గొననున్నారు.
గత సెప్టెంబరు 7న కన్యాకుమారి నుంచి ప్రారంభించిన భారత్ జోడో యాత్ర.. 75 జిల్లాల్లో 4,080 కిలోమీటర్ల దూరం కొనసాగింది. ఆదివారం శ్రీనగర్‌లోని బౌలేవార్డ్ ప్రాంతంలోని నెహ్రూ పార్క్ వద్ద ముగిసింది. సోమవారం ప్రతిపక్ష పార్టీల నేతలతో కలిసి బహిరంగ సభను నిర్వహించే అవకాశమున్నది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొత్తం 135 రోజుల పాటు కొనసాగింది.