బెంగళూర్ : ఓబీసీలకు నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Karnataka Assembly Elections) విమర్శించారు. ఓబీసీలను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వారికి అందించాలని, ఓబీసీ జనాభా గణాంకాలను ప్రధాని వెల్లడించాలని కోరారు. ప్రధాని ఎన్నడూ ఈ పని చేయరని, ఎందుకంటే ఆయనకు ఓబీసీల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం బీదర్‌లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
కర్నాటకలో ప్రస్తుత బీజేపీ సర్కార్‌ను 40 పర్సెంట్ కమిషన్ ప్రభుత్వమని ప్రజలే వ్యవహరిస్తున్నారని, ఈ పదాన్ని కాంగ్రెస్ పార్టీ వాడలేదని రాహుల్ పేర్కొన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపి కాంగ్రెస్‌కు పాలనా పగ్గాలు అందించాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే అవినీతిని పారదోలి పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్‌బై చెప్పారు.
తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ (Jagadish Shettar) కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం ఆయనకు సీటు నిరాకరించడంతో.. ఆదివారం తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగదీష్ శెట్టర్ రాజీనామా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇక మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More