బెంగళూరు: కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీజేపీకి (BJP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్‌బై చెప్పగా.. తాజాగా మాజీ సీఎం, పార్టీ సీనియర్ నేత జగదీశ్ శెట్టర్ (Jagadish Shettar) కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ అధిష్ఠానం ఆయనకు సీటు నిరాకరించడంతో.. ఆదివారం తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జగదీశ్ శెట్టర్ మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటకలో బీజేపీని బలపరిచేందుకు పార్టీ కార్యకర్తగా నిరంతరం శ్రమించానని అన్నారు. సీనియర్ నాయకుడినైన తనకు టికెట్ వస్తుందని ఆశించానని, అయితే కనీసం తనకు మాట కూడా చెప్పకుండా టికెట్ తిరస్కరించడంతో షాక్ గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రస్తుతం కొందరు వ్యక్తుల నియంత్రణలో ఉందన్నారు. తాను మనస్ఫూర్తిగానే కాంగ్రెస్‌లో చేరుతున్నానని శెట్టర్ తెలిపారు.
జగదీశ్ శెట్టర్ చేరిక కాంగ్రెస్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శెట్టర్ తాను గెలవడమే కాకుండా మరికొందరిని గెలిపించగల సమార్థ్యం ఉన్న నేత అని చెప్పారు. కాగా, ఉత్తర కర్ణాటకకు చెందిన లింగాయత్ (Lingayat) నేతల్లో అత్యంత ప్రముఖుడైన శెట్టర్ రాజీనామా బీజేపీకి ఎన్నికల్లో దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.