న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: బీజేపీకి వ్యతిరేకంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయటమే లక్ష్యంగా.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతో బీహార్ ముఖ్య మంత్రి నితీశ్‌కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బుధవారం సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలలోగా సాధ్యమైనన్ని ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావటమే లక్ష్యంగా సమావేశం జరిగిందని భేటీ అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో నేతలు తెలిపారు.
ఈ సమావేశం చరిత్రాత్మకమైనదని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అభివర్ణించారు. దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకొనేందుకు బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు నితీశ్‌కుమార్ మూలస్తంభంగా నిలుస్తున్నారని ఆయన పార్టీ జేడీయూ ట్విట్టర్లో పేర్కొన్నది.