Baba Siddique : ఎన్సీపీ సీనియర్ నేత, మహరాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. సిద్దిఖీ హత్యపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సిద్దిఖీ కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఈ హత్య మహారాష్ట్రలో శాంతిభద్రతల క్షీణతకు నిదర్శనమని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. బాంద్రాలోని తన కుమారుడి కార్యాలయంలో ఉండగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన ఆయన భద్రతా సిబ్బంది, కుటుంబ సభ్యులు హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సిద్ధిఖీ కన్నుమూశారు. అయితే కాల్పులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
కాగా, సిద్దిఖీ 1999, 2004, 2009 ఎన్నికల్లో బాంద్రా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009లో రాష్ట్ర మంత్రివర్గంలో ఆయనకు చోటు లభించింది. ప్రజా సేవ చేయడంతోపాటు గ్రాండ్‌గా పార్టీలు నిర్వహిస్తారనే పేరు సిద్ధిఖీకి ఉంది. 2013లో సిద్ధిఖీ నిర్వహించిన ఇఫ్తార్ విందులో బాలీవుడ్ స్టార్స్ షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. అప్పట్లో వారి మధ్య విబేధాలు ఉండేవట. ఈ పార్టీలోనే సిద్ధిఖీ ఆ ఇద్దరు స్టార్స్‌ను దగ్గరకు చేర్చి గొడవలకు పుల్‌స్టాప్ పెట్టించారట.