న్యూఢిల్లీ, జూలై 12: భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాది రాష్ర్టాలు వణికిపోతున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లలో జనజీవనం స్తంభించిపోయింది. యమునా నదికి వరదనీరు పోటెత్తటంతో..బుధవారం నీటిమట్టం ఆల్‌టైం రికార్డ్‌స్థాయికి చేరుకుంది. 45 ఏండ్ల తర్వాత నదిలో నీటిమట్టం 207 మీటర్లు దాటిందని కేంద్ర జల సంఘం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం బుధవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. తక్షణమే నివాస ప్రాంతాల్ని ఖాళీ చేయాలని లోతట్టు ప్రాంత ప్రజలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వివిధ రాష్ర్టాల్లో జరిగిన ప్రమాద ఘటనల్లో దాదాపు 91మంది మృతి చెందారని మీడియాలో వార్తలు వెలువడ్డాయి. మరోవైపు పంజాబ్, హర్యానాలో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హిమాచల్‌లో పర్యాటకులు కష్టాలు అంతాఇంతా కాదు. 2వేల మంది పర్యాటకుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ప్రకటించారు.