న్యూఢిల్లీ: రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలగించింది. 2023 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. చద్దా స్థానంలో పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను ఆప్ నియమించింది. ఈ మార్పు గురించి రాజ్యసభ సచివాలయానికి సమాచారాన్ని ఆప్ పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్లో మాట్లాడేందుకు చద్దాకు మైక్ కేటాయించకూడదని ఓ లేఖలో ఆప్ పేర్కొన్నది.
ఆప్ తీసుకున్న ఈ చర్య పార్టీలో అసమ్మతి వదంతులకు దారి తీయగా ఉప నాయకుడిగా ఎంపికైన అశోక్ మిట్టల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ అంతా సవ్యంగానే ఉందని, ఈ మార్పు సాధారణమైనదేనని అన్నారు. ఆప్, దాని అగ్రనాయకత్వానికి సంబంధించిన కీలక పరిణామాలపై చద్దా మౌనం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.