న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, మరో ఆరుగురు ఎంపీలు తాము పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో విలీనం అవుతున్నట్లు ప్రకటించిన దరిమిలా వారికి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వారికి వర్తిస్తుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిణామం మహారాష్ట్రలోని గత రాజకీయ సంక్షోభాలతో పోలికలను రేకెత్తించింది. అక్కడ అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే వంటి నాయకులు ఇలాంటి రాజ్యాంగ నిబంధనల కింద అనర్హత నుండి తప్పించుకున్నారు.
అయితే చట్టం కేవలం సంఖ్యలపై మాత్రమే ఆధారపడి ఉండదు. ఆప్‌కు చెందిన 10 మంది రాజ్యసభ సభ్యుల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది బీజేపీలో విలీనం కావడానికి సంబంధించిన లేఖపై సంతకాలు చేశారని చద్దా చెబుతున్నప్పటికీ వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి ఇప్పటికీ వర్తించవచ్చు. ఆ సభ్యులు ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకోవాలంటే అసలు పార్టీ బీజేపీలో విలీనం కావాల్సి ఉంటుంది.
పదో షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా గుర్తింపు పొందిన వర్గానికి ఆ పార్టీ శాసనసభ్యుల్లో కనీసం మూడింట రెండు వంతుల మంది మద్దతు ఉంటే అనర్హత నుంచి రక్షణ ఉంటుంది. అజిత్ పవార్ లేదా ఏక్నాథ్ షిండే ఇద్దరూ తమ పార్టీ శాసనసభ్యులలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది మద్దతును పొందారు కాబట్టి ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించలేదు.
దీంతో తాము పార్టీ ఫిరాయించిన వారిగా కాకుండా అసలైన పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామని వాదించడానికి వారికి అవకాశం లభించింది. ఈ వాదనను స్పీకర్ అంగీకరించారు. పదవ షెడ్యూల్లోని 4వ పేరా శాసనసభ్యులు అనర్హతను నివారించగల షరతులను నిర్దేశిస్తుంది. అసలు రాజకీయ పార్టీ మరో పార్టీలో చేరే అధికారిక విలీనం విషయంలో, ఆ చర్యకు దాని శాసనసభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మంది మద్దతు ఇచ్చినపుడు మాత్రమే ఈ రక్షణ వర్తిస్తుందని అది స్పష్టం చేసింది.