Puri Rath Yatra | పూరీ: వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది. భక్తులు ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ నినాదాలతో మూడు రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. ఈ ఏడాది రథయాత్ర రెండు రోజులపాటు జరుగుతున్నది. 53 ఏళ్ల క్రితం 1971లో రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. జగన్నాథుడి రథయాత్రకు భారత రాష్ట్రపతి హాజరు కావడం ఇదే తొలిసారి.
Ratha Yatra
భక్తుడి మృతి.. 300 మందికి గాయాలు
రథయాత్రలో అపశ్రుతి చోటచేసుకుంది. రథం లాగుతుండగా భక్తుల మధ్య జరిగిన స్వల్ప తోపులాటలో ఒకరు మరణించగా.. 300 మంది స్వ ల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే దవాఖానలకు తరలించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చే చెరాపహరా కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత బలభద్రుని తాళ ధ్వజ రథాన్ని ముందుకు నడిపిస్తుండగా జరిగిన తోపులాటలో ఒక భక్తుడు మరణించాడు.