భువనేశ్వర్: భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర (Jagannath Rath Yatra) మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించడానికి లక్షలాదిమంది భక్తులు వేచిచూస్తారు. జగన్నాథుడి రూపంలో ఉన్న కృష్ణుడి రథంతోపాటు ఆయన అన్న బలరాముడు, వారి చెల్లి సుభద్ర రథాలలో కొలువై భక్తులకు దర్శనమివ్వనున్నారు. లక్షలాది భక్తులు వెంటరాగా ఈ రథాలు జగన్నాథుడి భారీ ఆలయ ప్రాంగణం నుంచి అక్కడికి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరానికి (Gundicha Temple) రథాలపై తరలివెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జగన్నాథ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయల పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఈ వేడుకలో 12 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అంచనావేసిన అధికారులు, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేశారు. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు.
సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనిక భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు అంతేకాదు,. రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు.
పూరీ జగన్నాథ ఆలయం నుంచి గుండిచా మందిరం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒకరోజు యాత్ర తర్వాత మూడు మూర్తులూ ఏడు రోజులపాటు గుండిచా ఆలయంలో విడిది చేస్తారు. తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తారు.
నాగరశైలి మందిరం
జగన్నాథ దేవాలయం ఉత్తర భారత ఆలయ సంప్రదాయమైన నాగరశైలిలో ఉంటుంది. ఆలయాన్ని మొదట ఇంద్రద్యుమ్నుడనే రాజు నిర్మించాడని చెబుతారు. ఇప్పుడున్న భారీ ఆలయాన్ని 11-12 శతాబ్దాల్లో కళింగ (ఒడిశా) ప్రాంతాన్ని పరిపాలించిన అనంతవర్మ చోడగాంగ అనే రాజు నిర్మించాడు. గర్భాలయంలో కొలువైన అసంపూర్తిగా ఉన్న దారు (కొయ్య) విగ్రహాలకు సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మనే రూపమిచ్చాడని అంటారు.
బాహుదా ఉత్సవం
గుండిచా మందిరం నుంచి రథాల తిరుగు ప్రయాణాన్ని ‘బాహుదా ఉత్సవం’ అని పిలుస్తారు. ఈ వేడుక మర్నాడు మూడు మూర్తులకు బంగారు ఆభరణాలు అలంకరిస్తారు. దీన్ని ‘సునా బేష’ అని వ్యవహరిస్తారు. ఇక ముగ్గురూ ప్రధాన ఆలయంలో తిరిగి ప్రవేశించడాన్ని ‘నీలాద్రి బిజే’ అని పేర్కొంటారు. రథయాత్రలో ఇదే చివరి వేడుక.
జగన్నాథ రథయాత్రలో మొత్తం మూడు రథాలు పాల్గొంటాయి.
నందిఘోష: జగన్నాథుడి రథం పేరు నందిఘోష. ఇది 16 చక్రాలతో 46 అడుగుల ఎత్తు ఉంటుంది. మూడు రథాల్లో ఇదే ఎత్తయినది.
తాళధ్వజ: ఇది కృష్ణుడి అన్న బలరాముడు (బలభద్రుడి) రథం పేరు. 45 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో, 14 చక్రాలతో అలరారుతుంది.
దేవదళన: బలరామకృష్ణుల చెల్లి సుభద్ర ఊరేగే రథమే దేవదళన. 42 అడుగుల 3 అంగుళాల ఎత్తుతో, 12 చక్రాలను కలిగి ఉంటుంది ఈ రథం.