చండీగఢ్: ఇండియా కూటమిలోని పార్టీలు తలోదారిలో నడుస్తున్నాయి. జాతీయ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. దీనికి పంజాబ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనే తాజా ఉదాహరణ. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పంజాబ్‌లోని 13 లోక్‌సభ సీట్లలోనూ ఒంటరిగానే పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. ఆ రాష్ట్ర మంత్రి అన్మోల్ గగన్ మాన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 13 స్థానాల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని చెప్పారు. పంజాబ్‌లో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి సూచన మేరకే తామీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌దీ అదే దారి
పంజాబ్‌లోని కాంగ్రెస్ నేతలు సైతం ఆప్‌తో కలిసి పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. పార్టీ రాష్ట్ర కమిటీని సంప్రదించకుండా అధినాయకత్వం పంజాబ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా ఇప్పటికే అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి మూడో విడత సమావేశంలో ఎన్నికలకు ముందుగానే ఆయా రాష్ర్టాల్లోని పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకోవాలని, పార్టీలు పంతాలకు పోకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సామరస్యంగా వ్యవహరించాలంటూ తీర్మానించారు. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.