అమృత్సర్: శివసేన నాయకుడు సుధీర్ సూరి హత్యకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ నగరంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు స్థానికంగా ఉన్న రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు.
అమృత్‌సర్‌లోని మజీతా రోడ్లోగల గోపాల్ మందిర్ ఆవరణలో సుధీర్ సూరి శుక్రవారం ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన ఓ ఆగంతకుడు సుధీర్ సూరిపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుధీర్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
తమ నాయకుడి మరణంతో శివసేన కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్లపైన, రైల్వే ట్రాక్‌లపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. హంతకులను కఠినంగా శిక్షించాలని, హత్య వెనుక ఎవరి కుట్ర ఉన్నదో నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సుధీర్ కాల్పులు జరిపిన వ్యక్తిని, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు చెబుతున్నారు.