చండీఘడ్: ఉచితాలతో దివాళా తీసిన పంజాబ్ సర్కార్(Punjab Government).. ఇప్పుడు ఆదాయం పెంచే పనిలో పడింది. పంజాబ్ మంత్రి మండలి ఇవాళ రెండు కీలక నిర్ణయాలను తీసుకున్నది. పెట్రోల్, డీజిల్‌పై ధరలను పెంచింది. ఇక ఇంటి విద్యుత్తుపై ఉన్న సబ్సిడీని తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సీఎం భగవంత్‌మాన్ నేతృత్వంలో జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. పెట్రోల్ పై 61 పైసలు, డీజిల్‌పై 92 పైసల్ పెంచారు. దీని వల్ల రాష్ట్రానికి అదనంగా 1500 నుంచి 1700 కోట్ల ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తీవ్ర ఆర్థిక వత్తిడిలో ఉన్న పంజాబ్ సర్కార్.. ఆగస్టు నెలకు చెందిన జీతాలు, పెన్షన్‌ను రిలీజ్ చేయడంలో జాప్యం చేస్తున్నది. 7 కిలోవాట్ల వరకు విద్యుత్తును వినియోగించే ఇండ్లకు యూనిట్‌పై ఇచ్చే రూ.2.50 సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు పంజాబ్ సర్కారు తెలిపింది. ఈ స్కీమ్‌ను గత కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అయితే డొమెస్టిక్ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రి హర్పాల్ చీమా తెలిపారు. కొందరికి రెండు సబ్సిడీలు అందుతున్నాయని, వాటిని తగ్గించడం వల్ల రాష్ట్రానికి 392 కోట్లు ఆదా అవుతాయని తెలిపారు.