చండీగఢ్: పంజాబ్ రైతులు (Farmers Protest) మరోసారి నిరసనకు దిగారు. భూసేకరణ పరిహారం సరిపోవడం లేదని ఆరోపిస్తూ గురువారం పలు చోట్ల రైలు పట్టాలపై బైఠాయించారు. దీంతో పలు రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. భారత్‌మాల ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి ప్రభుత్వం సరిపడా పరిహారం ఇవ్వలేదని రైతులు ఆరోపించారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ (కేఎంసీ) ఆధ్వర్యంలో వందలాది రైతులు దేవిదాస్‌పురా గ్రామంలో గురువారం నిరసనకు దిగారు. రైల్వే ట్రాక్‌పై బైఠాయించి రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ మహిళా రైతును పోలీసులు కొట్టినట్లు రైతు సంఘం కేఎంసీ అధికార ప్రతినిధి గుర్బచన్ సింగ్ చబ్బా ఆరోపించారు. ఈ సంఘటనను ఖండిస్తూ జలంధర్ రైల్వే స్టేషన్‌లోని రైలు పట్టాలపై రైతులు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపినట్లు చెప్పారు.
కాగా, పంజాబ్ రైతుల నిరసనతో ఆ రాష్ట్రం మీదుగా నడిచే పలు రైళ్లపై దీని ప్రభావం పడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. లూథియానా-జలంధర్, అమృత్సర్-జలంధర్-జమ్మూ ప్రధాన రైల్వే లైన్లను రైతులు అడ్డుకున్నట్లు చెప్పారు. దీంతో అమృత్సర్, ఢిల్లీ మధ్య నడిచే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. రైతుల నిరసన నేపథ్యంలో పలు రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించినట్లు వెల్లడించారు.
మరోవైపు భూసేకరణ పరిహారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు రైలు పట్టాలపై తమ నిరసన కొనసాగుతుందని రైతు నేతలు హెచ్చరించారు. అలాగే శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను పోలీసులు కొట్టడంపై మండిపడ్డారు.
#WATCH | Punjab: Railway main line between Ludhiana to Jalandhar and Amritsar Jalandhar-Jammu blocked as farmers protest on railway tracks in Jalandhar. They are protesting over the incident wherein a Policeman was seen slapping an elderly woman protester in Gurdaspur during… pic.twitter.com/byHUlnlEh4
— ANI (@ANI) May 18, 2023