Donald Trump | ఆ 5 దేశాలపై ట్రంప్ కన్ను.. వెనెజువెలా తర్వాత వాటిపైనే దృష్టి
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు.
Donald Trump | న్యూఢిల్లీ, జనవరి 6: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో దఫా పాలనలో విదేశాంగ విధానం ద్వారా తన ఆకాంక్షలను తీర్చుకునే పనిలో పడ్డారు. రాత్రికి రాత్రి వెనెజువెలాపై కమాండో దాడి జరిపి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను బందీలుగా అమెరికాకు తరలించి ట్రంప్ తన పంతం నెరవేర్చుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ తదుపరి చర్యలపైనే నిమగ్నమయ్యాయి. వెనెజువెలా తర్వాత ఆయన ఏ దేశంపై కన్నేస్తారన్న చర్చ విస్తృతంగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవలి కాలంలో వివిధ దేశాలకు ఇచ్చిన హెచ్చరికలను, బయటపెట్టిన ఆకాంక్షలను గుర్తుచేసుకుందాం.
గ్రీన్లాండ్
గ్రీన్లాండ్లో ఇప్పటికే అమెరికాకు సైనిక స్థావరం ఉంది. అయితే ట్రంప్ తనకు మొత్తం ద్వీపమే కావాలంటున్నారు. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని తమకు గ్రీన్లాండ్ అవసరమని ఇటీవల విలేకరులకు ట్రంప్ చెప్పారు. ఆ ద్వీపమంతటా రష్యా, చైనా నౌకలు నిండిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కిటిక్ మహాసముద్రంలో విస్తారమైన ద్వీపకల్పమైన గ్రీన్లాండ్ డెన్మార్క్ రాజ్యంలో భాగం. అమెరికాకు ఈశాన్యం దిక్కున దాదాపు 2,000 మైళ్ల(3,200 కిలోమీటర్లు) దూరంలో ఈ ద్వీపం ఉంది. స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సైనిక పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకమైన భూ ఖనిజాలు గ్రీన్లాండ్లో అపారంగా ఉన్నాయి. కాగా, తమ దేశంపై పట్టు కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాన్ని పగటి కలలుగా గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సెన్ అభివర్ణించారు.
కొలంబియా
వెనెజువెలాలో సైనిక దాడి జరిగిన కొన్ని గంటలకే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు సైతం ట్రంప్ హెచ్చరికలు జారీచేశారు. పెట్రో అంతు చూస్తానని ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాకు పశ్చిమాన పొరుగుదేశమైన కొలంబియాలో అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. అంతేగాక బంగారం, వెండి, పచ్చలు(ఎమెరాల్డ్), ప్లాటినం, బొగ్గు ఉత్పత్తిలో కొలంబియా అగ్రస్థానంలో ఉంది. డ్రగ్స్ వ్యాపారం ముఖ్యంగా కొకైన్ తయారీ, సరఫరాలో కొలంబియా ఈ ప్రాంతంలోనే ముందంజలో ఉంది.
మెక్సికో
మెక్సికో దక్షిణ సరిహద్దు వెంబడి గోడను నిర్మిస్తామన్న పిలుపుతో ట్రంప్ 2016లో అధికారంలోకి వచ్చారు. 2025లో రెండోసారి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటిరోజే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని, గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికాలో డ్రగ్స్‌ని, అక్రమ వలసదారులను అడ్డుకోవడానికి మెక్సికన్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్ తరచూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ మెక్సికో ద్వారా అమెరికాలో డ్రగ్స్ ప్రవహిస్తున్నాయని, దీనిపై తాము ఏదో ఒకటి చేయాల్సిందేనని అన్నారు. అక్కడి డ్రగ్ కార్టెల్స్(సిండికేట్స్) చాలా బలంగా ఉన్నాయని వెల్లడించిన ట్రంప్ వాటిపై పోరాడేందుకు అమెరికన్ బలగాలను మెక్సికోకు పంపడానికి తాను సంసిద్ధత తెలిపానని, అయితే తమ భూభాగంపై అమెరికా సైనిక చర్యకు అనుమతించేది లేదని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పార్డో బహిరంగంగా ప్రకటించారని ట్రంప్ చెప్పారు.
క్యూబా
ఫ్లోరిడాకు దక్షిణాన కేవలం 90 మైళ్ల(145 కిలోమీటర్లు) దూరంలో ఉన్న ద్వీప దేశం క్యూబాపై 1960వ దశకం నుంచి అమెరికా ఆంక్షలు కొనసాగుతున్నాయి. వెనెజువెలాతో సన్నిహిత సంబంధాలు ఉన్న క్యూబా నుంచి డాక్టర్లు, వైద్య సరఫరాలు జరుగుతుండగా ఇందుకు బదులుగా క్యూబాకు అవసరమైన చమురులో 30 శాతం వెనెజువెలా నుంచి సరఫరా అవుతున్నది. వెనెజువెలా అధ్యక్షుడు మదురో నిష్క్రమణతో క్యూబా నుంచి చమురు సరఫరాలు నిలిచిపోతే ఆ దేశం పూర్తిగా కుప్పకూలిపోతుంది. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న క్యూబాలో సైనిక జోక్యం అవసరం లేదని ఆదివారం విలేకరుల వద్ద ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్
ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చవిచూస్తున్న ఇరాన్లో నిరసనకారులపై తూటాలు పేలితే తమ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ పాలకులను ట్రంప్ హెచ్చరించారు. పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, గతంలో మాదిరిగా ప్రజలను చంపడం మొదలుపెడితే అమెరికా నుంచి బలమైన స్పందన ఉంటుందని ఆదివారం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విలేకరుల వద్ద ట్రంప్ హెచ్చరించారు. గత ఏడాది ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసిన అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఇరాన్ పాలకులను ట్రంప్ హెచ్చరించారు. అణ్వస్ర్ర్తాలను తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించుకున్న ఇరాన్‌ను అడ్డుకునే లక్ష్యంతో భారీ స్థాయిలో ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రారంభించిన క్షిపణి దాడులకు అమెరికా సైతం చేతులు కలిపింది. గతవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ట్రంప్ సమావేశం కాగా వారి మధ్య ప్రధానంగా ఇరాన్‌పైనే చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. 2026లో ఇరాన్‌పై మళ్లీ దాడులు ప్రారంభించే విషయాన్ని ట్రంప్ వద్ద నెతన్యాహు ప్రస్తావించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

