రంగారెడ్డి జిల్లా సగం అర్బన్, సగం రూరల్ ప్రాంతంగా ఉండి సుమారు రెండుకోట్ల మంది నివసిస్తున్నరు. ఎన్ని మున్సిపాలిటీలనైనా గ్రేటర్లో కలుపుకోవచ్చు కానీ, జిల్లా స్వరూపాన్ని మార్చవద్దు. జిల్లా పేరు మార్చినా ప్రజలు ఒప్పుకోరు!
రంగారెడ్డి/హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉండవచ్చని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని ఎవరైనా అనుకున్నారా? అని ప్రశ్నించారు. కవిత కూడా కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని స్పష్టంచేశారు. మంగళవారం అసెంబ్లీ ఆవరణలో చిట్‌చాట్ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి దక్కకపోవడంతో మల్రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘రంగారెడ్డి జిల్లాలో రెండు కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ, జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదు. జిల్లాలో నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం. నాకు ఎలాంటి నష్టంలేదు.
పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలి’ అని సూచించారు. రంగారెడ్డి జిల్లా చుట్టుపక్కల హైదరాబాద్ విస్తరించి ఉండటంతో రోజురోజుకూ ఎంతో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. జిల్లాలో సగం అర్బన్, సగం రూరల్ ప్రాంతంగా ఉన్నదని అన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాజనితమేనని, పేరు మారిస్తే జిల్లా ప్రజలు ఒప్పుకోరని స్పష్టంచేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఎన్ని మున్సిపాలిటీలనైనా గ్రేటర్లో కలుపుకోవచ్చు కానీ, జిల్లా స్వరూపాన్ని మార్చవద్దని సూచించారు. ఫ్యూచర్‌సిటీ పరిసరాల్లో రియల్ బూమ్ పెరిగిందని.. భూముల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని, కానీ భూములను ఎవరూ అమ్మడంలేదని పేర్కొన్నారు. ఫార్మాసిటీపై పోరాటం చేసినందుకే గతంలో తాను గెలిచినా.. ఓడిపోయినట్టు చిత్రీకరించారని అన్నారు. కానీ తాను ఈ ప్రాంత ప్రజల కోసమే పోరాడినట్టు తెలిపారు.