చండీగఢ్: కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన ఎస్యూవీ వాహనం టైర్ రిపేర్ కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్నది. ఒక లారీ వెనుక నుంచి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. కాంగ్రెస్ నేతతో పాటు డ్రైవర్ ఈ ప్రమాదంలో మరణించారు. (Khushbaz Jattana) పంజాబ్ కాంగ్రెస్ నేత ఖుష్‌బాజ్ సింగ్ జట్టానా తన ఎస్యూవీ వాహనంలో ప్రయాణించారు. గురువారం రాత్రి కుండ్లీ-ఘజియాబాద్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై వెళ్తుండగా ఆ వాహనం టైర్లో గాలిపోయింది. దీంతో రిపేర్ కోసం ఆ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు.
కాగా, వేగంగా వచ్చిన లారీ ఆగి ఉన్న ఎస్‌యూవీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖుష్‌బాజ్ జట్టానాతో పాటు ఆయన డ్రైవర్ పర్మిందర్ సింగ్ మరణించారు. ఆయన గన్‌మ్యాన్‌కు గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. ఖుష్‌బాజ్ జట్టానా వాహనాన్ని ఢీకొట్టిన లారీని గుర్తించినట్లు చెప్పారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు.

Khushbaz Jattana
మరోవైపు 45 ఏళ్ల ఖుష్‌బాజ్ సింగ్ జట్టానా 2017, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తల్వండి సాబో స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బఠిండా రూరల్ నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అకాల మరణంపై పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘ఘోర రోడ్డు ప్రమాదంలో చురుకైన, భవిష్యత్తు ఉన్న యువ నాయకుడు ఖుష్‌బాజ్ జట్టానాను కోల్పోవడం చాలా బాధాకరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ నేతలు కూడా ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు.