చండీఘడ్: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీజేపీ నేతలు సింధూరాన్ని పంపిణీ చేస్తున్నారు. లుథియానాలో జరిగిన ఆ పంపిణీ కార్యక్రమాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ తప్పుపట్టారు. బీజేపీ ఇప్పుడేమైనా ఒకే దేశం, ఒకే భర్త(వన్ నేషన్ వన్ హజ్బెండ్, One Nation One Husband) స్కీమ్‌ను ప్రారంభించిందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం మాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
లుథియానా వెస్ట్ సీటు కోసం త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. జూన్ 19వ తేదీన ఆ ఎన్నిక జరగాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ వాళ్లు సింధూరాన్ని పంపిణీ చేస్తే, మోదీ పంపిన సింధూరం పెట్టుకోవాలని భార్యను భర్త అడుగుతాడని, అంటే బీజేపీ ఏమైనా వన్ నేషన్ వన్ హజ్బెండ్ స్కీమ్‌ను ప్రారంభించిందా అని సీఎం మాన్ ప్రశ్నించారు.
సీఎం మాన్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ నేత ప్రీత్‌పాల్ సింగ్ భలియావాల్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ను ఆయన విమర్శిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి బీజేపీ సింధూరాన్ని పంచడం లేదని, ఉగ్రవాదులు మతం అడిగి మరీ హిందువులను చంపారని, అందుకే సింధూరం పేరు పెట్టారన్నారు. ఇండియన్ ఆర్మీని కించపరుస్తున్నారన్నారు. వీర నారీలను అవమానిస్తున్నారని తెలిపారు. పవిత్రమైన గుర్తులపై జోక్ చేయడం అలవాటైనవారికి సింధూరం విలువ తెలియదన్నారు. త్యాగం, ప్రేమ, భక్తికి ఆ సింధూరం సంకేతంగా నిలుస్తుందన్నారు.